10.2-706-క.
విమలమతి నిట్టి మఖ రా
జమునకుఁ దెప్పింపవలయు సంభారంబుల్
సమకూర్పుము; నీ యనుజుల
సమదగతిం బంపు నిఖిలశత్రుల గెల్వన్."
10.2-707-క.
అను మాటలు విని కుంతీ
తనయుఁడు మోదమునఁ బొంగి తామరసాక్షున్
వినుతించి శౌర్యకలితుల
ననుజుల దెసఁ జూచి పలికె హర్షముతోడన్.
10.2-708-క.
"సృంజయభూపాలకులునుఁ
గుంజర రథ వాజి సుభట కోటులు నినుఁ గొ
ల్వం జను" మని సహదేవుని
నంజక పొమ్మనియె దక్షిణాశ జయింపన్.
భావము:
బహు గొప్పదైన ఈ రాజసూయ యాగానికి అవసరమైన సామగ్రిని సమకూర్చు. శత్రువులు అందరినీ జయించడానికి నీ సహోదరులను పంపించు.” ఈవిధంగా పలికిన శ్రీకృష్ణుడి మాటలు వినిన ధర్మజుడు ఎంతో సంతోషించి, పద్మాక్షుడిని ప్రస్తుతించాడు. మహాపరాక్రమవంతులైన తన సహోదరులతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. “సహదేవా! నీవు సృంజయ రాజులూ, చతురంగబలాలూ నిన్ను కొలుస్తూ వస్తారు. వారిని తీసుకు వెళ్ళి దక్షిణ దిక్కును జయించి రమ్ము” అని సహదేవుడిని ఆజ్ఞాపించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=708
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :p
No comments:
Post a Comment