10.2-709-క.
ప్రకటచతుర్విధ సేనా
ప్రకరంబులు గొలువఁ బంచెఁ బడమటిదిశకున్
నకులున్ విదళిత రిపు భూ
పకులున్ శౌర్యంబు మెఱసి పార్థివముఖ్యా!
10.2-710-క.
దుర్జనభంజను శౌర్యో
పార్జితవిజయప్రకాండు నాహవనిపుణు
న్నర్జునమహితయశోనిధి
నర్జును నుత్తరపు దిశకు ననిచె నరేంద్రా!
10.2-711-ఆ.
మహితశౌర్యనిధులు మత్స్య కేకయ మద్ర
భూతలేంద్రబలసమేతముగను
దర్పమొప్ప బంచెఁదూర్పుదిక్కునకు ను
ద్దామనిహిత వైరిధాము భీము.
భావము:
ఓ మహారాజా! పరీక్షిత్తూ! ప్రసిద్ధులైన రథ, గజ, తురగ, పదాతులనబడే నాలుగు విధాల సైన్యాలతో పడమటిదిక్కును జయించి రమ్మని నకులుడిని పంపించాడు. దుర్మార్గుల్ని శిక్షించేవాడూ,మహా శౌర్యోపేతుడూ, విజయశీలుడూ, గొప్ప యుద్ధనిపుణుడూ, స్వచ్ఛమైన కీర్తి కలవాడూ అయిన అర్జునుడిని ఉత్తర దిక్కును జయించడానికి నియోగించాడు. తూర్పుదిక్కును జయించడానికి గొప్ప శౌర్యవంతు లైన మత్స్య, కేకయ, మద్ర రాజులతో కలిసి శత్రువుల తేజస్సులు హరించుటలో మేటి ఐన భీముడిని వెళ్ళమని ధర్మరాజు పంపించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=711
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment