Wednesday, 22 September 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౫(345)

( దిగ్విజయంబు) 

10.2-712-చ.
పనిచిన వార లేగి ఘనబాహుపరాక్రమ విక్రమంబుల
న్ననుపమశౌర్యులైన చతురంతమహీశుల నోర్చి కప్పముల్‌
కనక వినూత్న రత్న తురగప్రముఖాఖిల వస్తుజాతముల్‌
గొని చనుదెంచి ధర్మజునకుం బ్రణమిల్లి యుదాత్త చిత్తులై. ,
10.2-713-చ.
తమతమ పోయివచ్చిన విధంబుల భూపతులన్ జయించుటల్‌
క్రమముగఁ జెప్ప నందుల జరాతనయుం డరివెట్టఁ డయ్యె నం
చమరవరేణ్యనందనుఁ డహంకృతి దక్కఁగ విన్నవించినన్
యమసుతుఁడూరకుండెవికలాత్మకుఁడై విని యంతఁ గృష్ణుఁడున్
10.2-714-తే.
ధర్మనందనుఁ జూచి యుత్కలికతోడఁ
బలికె "మాగధుఁ బోరఁ జంపఁగ నుపాయ
మొకటి గల దది సెప్పెద నుద్ధవుండు
నాకుఁ జెప్పిన చందంబు నయచరిత్ర! 

భావము:
ఇలా ధర్మరాజు పంపించగా వెళ్ళిన భీమార్జున నకుల సహదేవులు మహాపరాక్రమవంతు లయిన ఆయా దిక్కులలోని రాజులను ఓడించి; వారిచేత కప్పాలు కట్టించుకుని; బంగారం, మణులు, గుఱ్ఱాలు మొదలైన వస్తు సమూహాన్ని తీసుకుని వచ్చి ధర్మరాజునకు నమస్కారం చేసి అర్పించారు. తాము వెళ్ళివచ్చిన విధానములూ రణరంగంలో రాజులను జయించిన వివరాలూ అన్నగారికి వివరించారు. అందులో జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు చెప్పగా విని ధర్మరాజు వికలమైన మనస్సు కలవాడై మౌనం వహించాడు. అప్పుడు కృష్ణుడు. ధర్మరాజుతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. “ఓ ధర్మరాజా! జరాసంధుడిని చంపడానిక ఒక ఉపాయం ఉంది. నాకు ఉద్ధవుడు చెప్పిన ఆ ఉపాయం వివరిస్తాను విను. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=714 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...