Thursday 23 September 2021

శ్రీకృష్ణ విజయము - ౩౪౬(346)

( దిగ్విజయంబు) 

10.2-715-చ.
విను మగధేశ్వరుం డెపుడు విప్రజనావళియందు భక్తియున్
వినయముఁ గల్గి యెద్దియును వేఁడినచో వృథసేయ కిచ్చుఁగా
వున విజయుండునుం బవనపుత్రుఁడు నేనును బ్రాహ్మణాకృతిం
జని రణభిక్ష వేఁడిన వశంవదుఁడై యతఁ డిచ్చుఁ గోరికల్‌.
10.2-716-వ.
అట్టియెడ.
10.2-717-తే.
తవిలి యప్పుడు మల్లయుద్ధమున వానిఁ
బిలుకుమార్పింప వచ్చును భీముచేత!"
ననిన ధర్మజుఁ "డదిలెస్స" యనిన విప్ర
వేషములు దాల్చి యరిగిరి విశదయశులు. 

భావము:
మగధరాజైన జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే భక్తివిశ్వాసాలు అధికం. వారేది అడిగినా లేదనకుండా తప్పక ఇస్తాడు. కనుక, నేను, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి వాడిని యుద్ధభిక్ష కోరతాము. అతడు తప్పకుండా అంగీకరిస్తాడు. అలా జరాసంధుడు యుద్ధానికి అంగీకరించాక మల్లయుద్ధంలో భీముడిచేత అతడిని చంపించవచ్చు” అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ధర్మరాజు “ఇది బాగుం” దని అంగీకరించాడు. అంతట మహా కీర్తిశాలురు అయిన కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి బయలుదేరారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=717 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...