Sunday, 3 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౬(356)

( జరాసంధ వధ ) 

10.2-740-ఉ.
ప్రక్కలుఁ, జెక్కులున్, మెడలుఁ, బాణితలంబులచేఁ బగుల్చుచున్;
ముక్కు,లు నక్కులుం, జెవులు ముష్టిహతిన్ నలియంగ గ్రుద్దుచున్;
డొక్కలుఁ, బిక్కలున్ ఘనకఠోరపదాహతి నొంచుచున్; నెఱుల్‌
దక్కక స్రుక్క కొండొరులఁ దార్కొని, పేర్కొని పోరి రుగ్రతన్.
10.2-741-ఉ.
హుమ్మని మ్రోఁగుచుం, బెలుచ హుంకృతు లిచ్చుచుఁ, బాసి డాసి కో
కొమ్మనుచున్నొడళ్ళగల గుల్లల తిత్తులుగాఁ బదంబులం
గ్రుమ్ముచు, ముష్ఠి ఘట్టనల స్రుక్కుచు, నూర్పులు సందఁడింపఁగా
సొమ్మలు వోవుచుం, దెలియుచున్, మదిఁ జేవయు లావుఁ జూపుచున్ 

భావము:
ఆ ముష్టియుద్ధంలో భీమజరాసంధులు ప్రక్కలూ, చెక్కులూ, మెడలూ పగిలేలా చేతులతో బాదుకుంటూ, ముక్కులు పగిలేలా గ్రుద్దుకుంటూ, డొక్కల్లో పిక్కల్లో పొడుచుకుంటూ అతి భయంకరంగా పోరాడారు. భీమజరాసంధులు ఇద్దరూ హుంకారాలు చేస్తూ ఒకరి నొకరు తాకుతూ, తిరిగి దూరమవుతూ, శరీరాలు పగిలి గుల్లలయ్యేలా కాళ్ళతో కుమ్ముకుంటూ, పిడికిటి పోట్లతో నొప్పించుకుంటూ, సోలుతూ, వాలుతూ, రొప్పుతూ రోజుతూ, తేరుకుంటూ, బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడ సాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=741 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...