Monday, 4 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౭(357)

( జరాసంధ వధ ) 

10.2-742-వ.
ఇవ్విధంబున వజ్రివజ్రసన్నిభంబగు నితరేతర ముష్టిఘట్టనంబుల భిన్నాంగులై, రక్తసిక్తశరీరంబులతోడం బుష్పితాశోకంబుల వీఁకను, జేగుఱుఁ గొండల చందంబునను జూపట్టి పోరుచుండఁ, గృష్ణుండు జరాసంధుని జన్మమరణప్రకారంబు లాత్మ నెఱుంగుటం జేసి, వాయుతనూభవున కలయికలేక లావును జేవయుఁ గలుగునట్లుగాఁ దద్గాత్రంబునందు దనదివ్యతేజంబు నిలిపి, యరినిరసనోపాయం బూహించి సమీరనందనుండు సూచుచుండ నొక్క శాఖాగ్రంబు రెండుగాఁ జీరివైచి వాని నట్ల చీరి చంపు మని సంజ్ఞగాఁ జూపిన, నతండు నా కీలుదెలిసి, యవక్రపరాక్రముండై మాగధుం బడఁద్రోచి, వాని పదంబు పదంబునం ద్రొక్కి, బాహుయుగళంబున రెండవ పదంబుఁ గదలకుండంబట్టి, మస్తకపర్యంతంబుఁ బెళబెళమని చప్పుళ్ళుప్పతిల్ల మత్తదంతావళంబు దాళవృక్షంబు సీరు చందంబునఁ బాద జాను జంఘోరు కటి మధ్యోదరాంస కర్ణ నయనంబులు వేఱువేఱు భాగంబులుగా వ్రయ్యలు వాపి యార్చినఁ, బౌరజనంబులు గనుంగొని భయాకులులై హాహాకారంబులు సేసి;రంత. 

భావము:
ఇలా దేవేంద్రుడి వజ్రాయుధంలాంటి పిడిగ్రుద్దుల వలన శరీరాలు పగిలి కారుతున్న రక్తాలతో భీముడు జరాసంధుడు పుష్పించిన అశోకవృక్షాలలా, ఎఱ్ఱని కొండలలా కనబడసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి, భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి, భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు, ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చి పడేసాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి, రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని మదించిన ఏనుగు తాటిచెట్లను పెళపెళమనే శబ్దం పుట్టేలా చీల్చునట్లు, వాడిని తల వరకూ చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హహాకారాలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=742 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...