Wednesday, 6 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౮(358)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-743-క.
అనిలజుని దేవపతి నం
దనుఁడునుఁ బద్మాక్షుఁడును నుదారత నాలిం
గనములు సేసి పరాక్రమ
మున కద్భుతమంది మోదమునఁ బొగడి రొగిన్.
10.2-744-క.
వనజాక్షుఁ డంతఁ గరుణా
వననిధియును భక్తలోకవత్సలుఁడునుఁ గా
వున మాగధసుతు సహదే
వునిఁ బట్టముగట్టెఁ దన్నవోన్నతపదవిన్.
10.2-745-క.
మగధాధినాథునకు ము
న్నగపడి చెఱసాలలను మహాదుఃఖములన్
నొగులుచుఁ దన పాదాంబుజ
యుగళము చింతించుచున్న యుర్వీశ్వరులన్. 

భావము:
జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు. దయామయుడూ భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టం గట్టి మగధరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ (విడిపించాడు) 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=745 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...