Monday, 11 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౩(363)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-756-వ
అది గావున మీ మనంబుల దేహం బనిత్యంబుగాఁ దెలిసి.
10.2-757-ఉ.
మీరలు ధర్మముం దగవు మేరయుఁ దప్పక, భూజనాళిఁ బెం
పారుచు, సౌఖ్యసంపదల నందఁగఁ బ్రోచుచు, భూరియజ్ఞముల్‌
గౌరవవృత్తి మత్పరముగా నొనరింపుచు, మామకాంఘ్రి పం
కేరుహముల్‌ భజించుచు నకిల్బిషులై చరియింపుఁ డిమ్ములన్.
10.2-758-వ.
అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్య ప్రాప్తులయ్యెదురు; మదీయ పాదారవిందంబులందుఁ జలింపని భక్తియుఁ గలుగు"నని యానతిచ్చి యా రాజవరుల మంగళస్నానంబులు సేయించి, వివిధ మణి భూషణ మృదులాంబర మాల్యానులేపనంబు లొసంగి, భోజన తాంబూలాదులం బరితృప్తులం జేసి, యున్నత రథాశ్వ సామజాధిరూఢులం గావించి, నిజరాజ్యంబులకుఁ బూజ్యులంచేసి, యనిచిన. 

భావము:
కావున, ఈ శరీరం శాశ్వతంకాదని మీరు గ్రహించండి. మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి. మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=758 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...