Tuesday, 12 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౪(364)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-759-క.
నరవరు లీ చందంబున
మురసంహరుచేత బంధమోక్షణులై సు
స్థిరహర్షంబులతో నిజ
పురములకుం జనిరి శుభవిభూతి తలిర్పన్.
10.2-760-క.
హరిమంగళగుణకీర్తన
నిరతముఁ గావించుచును వినిర్మలమతులై
గురుబంధుపుత్త్రజాయా
పరిజన మలరంగఁ గృష్ణుఁ బద్మదళాక్షున్.
10.2-761-వ.
బహుప్రకారంబులం బొగడుచుఁ దమతమ దేశంబులకుం జని.
10.2-762-క.
నళినదళలోచనుఁడు దముఁ
దెలిపిన సద్ధర్మపద్ధతినిఁ దగవరులై
యిలఁ బరిపాలించుచు సుఖ
ముల నుండిరి మహితనిజవిభుత్వము లలరన్.
భావము:
జరాసంధుడిచే బంధింపబడిన ఆరాజులందరూ ఈ విధంగా శ్రీకృష్ణుడిచేత బంధవిముక్తులై, ఎంతో సంతోషంతో గౌరవప్రదంగా వారి వారి రాజ్యాలకు బయలుదేరారు. తమ భార్యా పుత్రులు మిత్రులు మున్నగువారు సంతోషించగా నిర్మలహృదయులై పద్మాక్షుడు శ్రీకృష్ణుడి సద్గుణాలను సంకీర్తిస్తూ, శ్రీకృష్ణుడిని ఆ రాజులు అనేక రకాల నుతిస్తూ తమ తమ రాజ్యాలకు వెళ్ళారు. ఆ రాజులు అందరూ న్యాయశీలురై శ్రీకృష్ణుడు ప్రబోధించిన ధర్మమార్గాన్ని తప్పక తమ తమ రాజ్యాలను వైభవంగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=762 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...