Monday, 18 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౯(369)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-771-సీ.
అర్థిజాతము గోరినట్టి వస్తువు లెల్లఁ-
  దగఁ బంచియిడఁగఁ రాధాతనూజు,
సరసాన్న పానాది సకలపదార్థముల్‌-
  పాకముల్‌ సేయింపఁ బవనతనయుఁ,
బంకజోదరు నొద్దఁ బాయక పరిచర్య-
  దవిలి కావింప వాసవతనూజు,
సవన నిమిత్తంబు సంచితద్రవ్యంబు-
  పెంపుతో వేగఁ దెప్పింప నకులు,
10.2-771.1-తే.
దేవగురు వృద్ధధాత్రీసురావలులను
నరసి పూజింప సహదేవు, నఖిలజనులఁ
బొలుచు మృష్టాన్న తతులఁ దృప్తులను జేయ
ద్రౌపదిని నియమించెను ధర్మసుతుఁడు.
10.2-772-వ.
అయ్యవసరంబున.
10.2-773-చ.
హరి శిఖి దండపాణి నికషాత్మజ పాశి సమీర గుహ్యకే
శ్వర శశిమౌళి పంకరుహసంభవ చారణ సిద్ధ సాధ్య కి
న్నర గరుడోరగామరగణంబులు వచ్చి మఖంబుఁ జూచి య
చ్చెరువడి "తొల్లి యెవ్వరునుఁ జేయుమఖంబులునింత యొప్పునే 

భావము:
కర్ణుడిని యాచకులు అడిగిన వస్తువులను దానం చేయటానికి; భీముడిని షడ్రసోపేత భోజనపదార్థాలను తయారు చేయించటానికి; శ్రీకృష్ణుడికి సేవలు చేయటానికి అర్జునుడిని; నకులుడిని యజ్ఞానికి అవసరమైన సంబారాలను సమకూర్చటానికి; సహదేవుడిని దేవతలను బ్రాహ్మణులను గురువులను పెద్దలను గౌరవించటానికి; యాగానికి విచ్చేసిన సమస్త ప్రజలూ మృష్టాన్నపానాలతో సంతుష్టులయ్యేలా చూడడానికి ద్రౌపదినీ; ధర్మరాజు నియమించాడు. అలా యాగం జరుగుతుంటే దేవేంద్రుడు మొదలైన దిక్పాలురూ; బ్రహ్మాది దేవతలూ; సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గరుడ, నాగ మున్నగు దేవగణములు; వచ్చి ధర్మరాజు చేస్తున్న యజ్ఞాన్ని చూసారు. “ఇంతకు పూర్వం యే రాజు కూడా ఇంత గొప్పగా యజ్ఞం చేయలే” దని మెచ్చుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=773 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...