Tuesday, 19 October 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౧(371)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-777-వ.
పూజించునప్పు డందగ్రపూజార్హు లెవ్వరని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతురవచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకులసంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి “యిమ్మహాత్ముని సంతుష్టుంజేసిన భువనంబు లన్నియుం బరితుష్టిం బొందు” నని చెప్పి ధర్మజుం జూచి యిట్లనియె.
10.2-778-ఉ.
"కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ
జ్జాలముదైవమున్గురువుసాంఖ్యముమంత్రమునగ్నియాహుతుల్‌
వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్‌
లీలలఁ దాన యై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్. 

భావము:
అలా యాగాంతంలో పెద్దలను పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హులు ఎవరు అని అడుగగా, సభలో ఉన్నవారు ఎవరికి తోచినట్లు వారు తలకొక రకంగా చెప్పసాగారు. వారి మాటలను వారించి, వాక్ చాతుర్యం కలవాడు, బుద్ధిమంతుడు ఐన సహదేవుడు కృష్ణుడిని చూపించి “ఈ మహాత్ముడిని సంతుష్టుణ్ణి చేస్తే సమస్త లోకాలూ సంతోషిస్తాయి.” అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు. “కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్త, భోక్త, లోకాలు, దైవము, గురువు, మంత్రము, అగ్ని, ఆహుతులు, యాజికులు, సృష్టిస్థితిలయాలూ, సమస్తము తానే అయి ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈ శ్రీకృష్ణపరమాత్ముడు ఒక్కడే. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=778 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...