Wednesday 18 May 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౬(546)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1151-వ.
దేవా! యే నరుండైన నేమి శ్రద్ధాగరిష్ఠచిత్తుండై మిమ్ము సేవించు నట్టి మహాత్ముండు విధిచోదితంబయిన ప్రమాణంబువలన విముక్తుండై వర్తించు; నట్లుగావున యోగీశ్వరుండవైన నీ వీశితవ్యుల మైన మమ్ము నిష్పాపులం జేయు” మని నుతించి మఱియు నిట్లనియె.
10.2-1152-మత్త.
“కంటిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం
గంటి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము
క్కంటి తామరచూలియుం బొడఁ గాననట్టి మహాత్మ! నా
యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్.

భావము:
దేవా! శ్రద్ధాతిశయంతో నిన్ను సేవించే వాడు ఎవరైనా సరే మహాత్ముడే. ఆ మహాత్ముడు సంసారబంధాల నుంచి విముక్తుడవుతాడు. కనుక మహాయోగులకు ఈశ్వరుడవు ఐన నీవు పాలించదగినవారము ఐన మమ్మల్ని పాపరహితులను కావించు.” అని స్తుతించి, ఇంకా ఇలా అన్నాడు. “నా పాపం అంతరించింది; సంసారసాగరం దాటగలిగాను; ముక్తిసాధనం చూడగలిగాను; నీ కరుణాదృష్టికి పాత్రుడనయ్యాను; పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కానరాని మహాత్మా! నీవు నా గృహానికి విచ్చేశావు. నేను ధన్యుడిని అయ్యాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1152

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...