Thursday 19 May 2022

శ్రీకృష్ణ విజయము - ౫౪౭(547)

( మృతులైన సహోదరులఁదెచ్చుట ) 

10.2-1153-వ.
దేవా! యేను భవద్దాసుండ! నేది పంచినం జేయుదు; నిచ్చటికి మీరలు విజయంబు చేసిన కార్యం బానతీయవలయు” నని కరంబులు మొగిచి, విన్నవించినం బుండరీకాక్షుం డతని వాక్యంబులకు సంతసిల్లి యిట్లనియె
10.2-1154-సీ.
"బలిదైత్య! విను మున్ను ప్రథమయుగంబున-
  నా మరీచికి భార్యయైన వర్ష
యను నింతివలన నందను లార్వు రుద్భవ-
  మైరి వా రొక్కనాఁ డబ్జభవుఁడు
తనపుత్త్రిపై మోహమునఁ గూడి రతికేళి-
  యొనరింప వీరు నవ్వుటయుఁ గ్రోధ
మంది యాసురయోని యందుఁ బుట్టుం డని-
  ఘనశాప మిచ్చె న వ్వనజజుండు.
10.2-1154.1-తే.
తన్నిమిత్తమునను వారు దగిలి హేమ
కశిపునకుఁ బుట్టి రంత నా కౌకసులకు
నొదవ వీరలఁ దెచ్చి య య్యోగమాయ
యడరి దేవకిగర్భము నందుఁ జొనుప.

భావము:
భగవాన్! నేను నీ దాసుడిని; నీ అజ్ఞకు బద్ధుడిని; మీరిక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పండి.” అని బలిచక్రవర్తి చేతులు జోడించి భక్తితో విన్నవించాడు. కృష్ణుడు సంతోషించి అతనితో ఇలా అన్నాడు. “దైత్యేంద్ర! బలి! పూర్వం ఆదియుగంలో మరీచి అనువానికి భార్య వర్ష యందు ఆరుగురు పుత్రులు పుట్టారు. ఒకనాడు బ్రహ్మదేవుడు తన పుత్రికనే కామించి శృంగారక్రీడకు ఉపక్రమించటం చూసి వారు అపహాసం చేసారు. ఆగ్రహించిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా పుట్టండని శపించాడు. ఆ శాప కారణంగా వారు హిరణ్యకశిపుడికి కొడుకులుగా పుట్టారు. తరువాత దేవతల హితంకోరి యోగమాయ వారిని దేవకిగర్భం లోనికి ప్రవేశింప జేసింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=80&Padyam=1154

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...